సామెతలు 11:19-28

సామెతలు 11:19-28 TERV

నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కాని దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు. దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం. దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు. ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది. మంచి మనుష్యులకు వారు కోరింది లభించినప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కాని దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది. ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు. ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు. మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది. తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు. కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు.