నెహెమ్యా 6:1-9

నెహెమ్యా 6:1-9 TERV

నేను ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము మా ఇతర శత్రువులూ విన్నారు. మేము గోడలోని కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా తలుపులు అమర్చలేదు. సన్బల్లటూ, గెషెమూ నాకు, “నెహెమ్యా, నువ్వొకసారి వస్తే మనం కలుసు కుందాము. ఓనో మైదానంలోని కెఫీరిము గ్రామంలో కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్లు నాకు హాని తలపెట్టారని నాకు తెలుసు. అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము లేదు” అని సమాధానం పంపాను. సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నా వెనకటి సమాధానమే పంపాను. అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పియున్న ఒక లేఖవుంది. ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది, “ఒక విషయం నాలుగు ప్రక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నీవూ, యూదులూ రాజు మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నీవు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నీవు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు. యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని ప్రకటించేటందుకు నీవు ప్రవక్తలను ఎంపిక చేశావన్న విషయం, ‘యూదాలో ఒక రాజు వున్నాడు!’ అన్న విషయం ప్రచారంలో వుంది. “నెహెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. అర్తహషస్త రాజురు ఈ విషయం వింటారు. అందుకని, నీవు రా, మనం కలిసి కూర్చుని ఈ విషయం మాట్లాడుకుందాము.” అందుకని, నేను సన్బల్లటుకి ఈ క్రింది సమాధానం పంపాను: “మీరు చెబుతున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.” మన శత్రువులు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్లు, “ఈ యూదులు భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగించేందుకు అసమర్థులవుతారు. అప్పుడిక ప్రాకార నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు. కాని నేను, “దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను.