వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు. కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది. వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు. వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు. యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు. ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు. “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు. యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు. “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు. “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
చదువండి మార్కు 9
వినండి మార్కు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 9:30-50
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు