యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు: “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు. నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు. “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు. “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి. “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను. “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది. “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి. “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.
చదువండి మత్తయిత 5
వినండి మత్తయిత 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయిత 5:1-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు