మత్తయిత 27:46-60

మత్తయిత 27:46-60 TERV

సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు?” అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు. కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు. యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు. అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి. సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు. యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు. చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు. వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు.