మత్తయిత 27:11-31

మత్తయిత 27:11-31 TERV

యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?” అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు. అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు. యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది. పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు. అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు. అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు. పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది. బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు. “ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు. “బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు. “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు. లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు. ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు. ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు. ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు.