మత్తయిత 26:1-13

మత్తయిత 26:1-13 TERV

యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు. ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు. బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది. ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు. యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. ఇది సత్యం — ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.