మత్తయిత 21:19-32

మత్తయిత 21:19-32 TERV

యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు. యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు. యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు. వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు. అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు. “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు. “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు. “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు. “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.” “మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.