ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది. యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు. ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది. యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు. “త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు. మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు. యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు. యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు. ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు. యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
చదువండి మత్తయిత 20
వినండి మత్తయిత 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయిత 20:20-34
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు