మత్తయిత 16:1-12

మత్తయిత 16:1-12 TERV

పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు. ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు. శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు. ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు. వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు. ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.