మత్తయిత 13:24-46

మత్తయిత 13:24-46 TERV

యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు. “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు. “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.” ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.” యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.” యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి: “నేను ఉపమానాల ద్వారా మాట్లాడి, ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.” ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు. “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి! “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.