మత్తయిత 13:1-32

మత్తయిత 13:1-32 TERV

అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!” శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు. ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది: ‘మీరు తప్పక వింటారు, కాని అర్థంచేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు. వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’ కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం. “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.” యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు. “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు. “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.” ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”