మత్తయిత 12:7-21

మత్తయిత 12:7-21 TERV

‘నాకు దయకావాలి, బలికాదు’ అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు. “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు. ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు. ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు. అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది. కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు. యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది: “ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు! ఆయన పట్ల నాకు ప్రేమవుంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు. ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు. న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు. ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”