లూకా 8:1-8

లూకా 8:1-8 TERV

ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు: “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.” ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.