లూకా 4:1-21

లూకా 4:1-21 TERV

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు. యేసు, “‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు. యేసు, “‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి, ఆయన సేవ మాత్రమే చెయ్యి’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు. ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’ అంతేకాక: ‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’ అని వ్రాయబడింది” అని అన్నాడు. యేసు, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు. యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు. ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు: “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని, గుడ్డివారికి చూపు కలిగించాలని, హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు. ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.” ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.