లూకా 2:25-38

లూకా 2:25-38 TERV

ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు: “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను. నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు! యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!” యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.” ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది. మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.

Free Reading Plans and Devotionals related to లూకా 2:25-38