లేవీయకాండము 4:27-35

లేవీయకాండము 4:27-35 TERV

“చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు. అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి. అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. “ఈ వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ గొర్రెయై ఉండాలి. అతడు దాని తలమీద తన చేయి ఉంచి, దహనబలి పశువును వధించే స్థలంలో, పాపపరిహారార్థ బలిగా దానిని కూడా వధించాలి. ఆ పాప పరిహారార్థ బలి రక్తాన్ని యాజకుడు తనవేలితో తీసుకొని, దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. తర్వాత ఆ గొర్రె రక్తాన్నంతా బలిపీఠం అడుగున అతడు పోయాలి. సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.