లేవీయకాండము 25:1-23

లేవీయకాండము 25:1-23 TERV

సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది. ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు. మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది. “భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది. మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది. “ఏడేసి సంవత్సరాల చొప్పున ఏడు ఏడుల సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి. 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు. అది బూరధ్వని చేసే 50వ సంవత్సర పండుగ మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు. నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు. “కానీ ఒకవేళ మీరు, ‘మేము విత్తనాలు చల్లి, పంట కూర్చుకొనకపోతే ఏడో సంవత్సరం తినేందుకు మాకు ఏమీ ఉండదు అనవచ్చు.’ చింతపడకండి. ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల పాటు పంట ఇస్తూనే ఉంటుంది. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ ఉంటారు. “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు.