లేవీయకాండము 16:1-14

లేవీయకాండము 16:1-14 TERV

యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు. మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు! “ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి. అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసుకొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు. “మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి. “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు. “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి. “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి. అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి. యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పుల మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు. అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.