యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “చర్మరోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియమాలు ఇవి. “ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకు ఇవే నియమాలు. చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి. బస వెలుపల ఆ వ్యక్తి దగ్గరకు యాజకుడు వెళ్లాలి. ఆ చర్మవ్యాధి బాగుపడినదేమో తెలుసుకొనేందుకు యాజకుడు పరిశీలించాలి. ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటే అతణ్ణి ఈ పనులు చేయమని యాజకుడు చెప్పాలి: ప్రాణంతో ఉన్న రెండు పవిత్ర పక్షుల్ని అతడు తీసుకొని రావాలి, ఒక దేవదారు చెక్క ముక్కను, ఎర్రటి గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు ముక్కను కూడా అతడు తీసుకొని రావాలి. ఇవన్నీ ఆవ్యక్తిని శుద్ధిచేసే పనికోసమే. ఒక మట్టి పాత్రలో పారుతున్న నీళ్లమీద ఒక పక్షిని చంపమని యాజకుడు చెప్పాలి. అప్పుడుయింకా ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, దేవదారు చెక్కముక్క, ఎర్ర గుడ్డ ముక్క, హిస్సోపు ముక్కను యాజకుడు తీసుకోవాలి. పారుతున్న నీళ్లమీద చంపబడిన మొదటి పక్షి రక్తంలో, ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, మిగతా వస్తువులను యాజకుడు ముంచాలి. చర్మవ్యాధి ఉన్న వ్యక్తి మీద యాజకుడు ఏడుసార్లు చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అప్పుడు యాజకుడు బహిరంగ స్థలానికి వెళ్లి, ప్రాణంతో ఉన్న పక్షిని స్వేచ్ఛగా ఎగిరిపోనివ్వాలి. “తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షౌరం చేసుకోవాలి. అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్లవచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారంబయట ఉండాలి. ఏడవ రోజున అతడు తన వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకోవాలి. అతడు తన తల, గడ్డం, కనుబొమ్మలు, వెంట్రుకలు అన్నీ క్షౌరం చేసుకోవాలి. తర్వాత అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రుడవుతాడు. “ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండినవాడు ఏ దోషం లేని రెండు మగ గొర్రెపిల్లలను తీసుకొని వెళ్లాలి. ఏ దోషం లేని ఒక్క సంవత్సరపు ఆడ గొర్రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యార్పణ కోసం నూనె కలిపిన మూడు పదోవంతుల మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు ఒలీవ నూనె ఆ వ్యక్తి తీసుకొని వెళ్లాలి. ఆ వ్యక్తి పవిత్రుడు అని ప్రకటించే యాజకుడు, ఆ వ్యక్తిని, అతని బలులను సన్నిధిగుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. గొర్రె పిల్లల్లో ఒకదాన్ని అపరాధపరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ గొర్రెపిల్లను, కొంతనూనెను యెహోవా ఎదుట నైవేద్యంగా అర్పించాలి. పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర స్థలంలోనే యాజకుడు మగ గొర్రెపిల్లను వధించాలి. అపరాధపరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా పవిత్రం. “అపరాధపరిహారార్థ బలినుండి కొంత రక్తాన్ని యాజకుడు తీసుకోవాలి. పవిత్ర పర్చబడాల్సిన వ్యక్తికుడి చెవి కొన మీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద, కుడి పాదపు బొటనవేలిమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. యాజకుడు కొంచెం నూనె తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. అప్పుడు యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేత వేలిని ముంచాలి. ఆ నూనెలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించేందుకు ఆవేలిని అతడు ఉపయోగించాలి. పవిత్ర పర్చబడాల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేలి మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధపరిహారార్థ బలి అర్పణపు రక్తం మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్చబడాల్సిన వ్యక్తి తలమీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. “తర్వాత ఆ వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు పాపపరిహారార్థ బలిని అర్పించి, ఆ వ్యక్తి పాపాలను తుడిచివేయాలి. ఆ తర్వాత దహనబలి పశువును యాజకుడు వధించాలి. అప్పుడు యాజకుడు దహనబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్పించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేయాలి. ఆ వ్యక్తి పవిత్రుడవుతాడు.
చదువండి లేవీయకాండము 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లేవీయకాండము 14:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు