యోహాను 8:37-59

యోహాను 8:37-59 TERV

మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు. “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి. “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.” “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు. యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు. ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు. యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు. ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు. యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.