యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు. ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు. ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు. “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు. యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు. పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు. అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!
చదువండి యోహాను 8
వినండి యోహాను 8
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 8:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు