యోహాను 20:1-10

యోహాను 20:1-10 TERV

ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది. పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు. అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.) ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు.