యోహాను 17:13-23

యోహాను 17:13-23 TERV

“నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది. “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం. “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.