యోహాను 16:1-15

యోహాను 16:1-15 TERV

“మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు. “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను. “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు. “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.