యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు. అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు. యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు. కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు. డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు. యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం. యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది. దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు” అని అన్నాడు. యేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు. “నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి వుండండి మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు” అని అన్నాడు. సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు. యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను అలుసరించగలుగుతావు” అని అన్నాడు. పేతురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నాడు. యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణంయిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధనం చెప్పాడు.
చదువండి యోహాను 13
వినండి యోహాను 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 13:21-38
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు