మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు. ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.) యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది. యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు. తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం. మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు. నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.
Read యోహాను 1
వినండి యోహాను 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 1:35-46
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు