యిర్మీయా 42:1-12

యిర్మీయా 42:1-12 TERV

వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు. వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.” అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.” తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.” పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను — మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’