న్యాయాధిపతులు 9:22-57

న్యాయాధిపతులు 9:22-57 TERV

అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవత్సరాలు పాలించాడు. అబీమెలెకు చంపిన డెభ్భై మంది యెరుబ్బయలు కుమారులు అబీమెలెకునకు స్వంత సోదరులే. ఈ చెడు కార్యాలు చేయటంలో షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీమెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించుటకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలుపెట్టారు. షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. ఆ దాడుల విషయం అబీమెలెకునకు తెలిసిపోయింది. ఎబెదు కుమారుడు గాలు అను పేరుగల మనిషి, అతని సోదరులు షెకెము పట్టణానికి తరలి వచ్చారు. షెకెము పట్టణానికి నాయకులు గాలును నమ్మేందుకు, వెంబడించేందుకు తీర్మానించారు. ఒకరోజు ద్రాక్ష పండ్లు ఏరుకొనేందుకు షెకెము ప్రజలు పొలాలకు వెళ్లారు. ప్రజలు ద్రాక్షరసం చేసేందుకు ద్రాక్షాపండ్లను పిండారు. తరువాత వాళ్లు తమ దేవుని ఆలయంలో ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలు తిని, త్రాగి అబీమెలెకుపై చెడుగా మాటలాడుకున్నారు. అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము షెకెము ప్రజలమా? మనమెందుకు అతనికి విధేయులవ్వాలి? అబీమెలెకు తనను ఏమనుకొంటున్నాడు? అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు కాడా? అబీమెలెకు జెబూలూను తన అధికారిగా నియమించలేదా? మనము అబీమెలెకునకు విధేయులం కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే హామోరు ప్రజలనే అనుసరించాలి. అని వారితో అన్నాడు. (హామోరు షెకెముకు తండ్రి) నీవు నన్ను ఈ ప్రజలకు ముఖ్యాధికారిగా చేస్తే, నేను అబీమెలెకును నాశనం చేస్తాను. నేను అతనికి ‘నీ సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి రా’” అని చెప్తాను. జెబులు షెకెము పట్టణానికి అధిపతియై ఉండెను. ఎబెదు కుమారుడైన గాలు ఈ మాటలను మాట్లాడినప్పుడు జెబలుకు చాలా కోపం వచ్చింది. అప్పుడతడు అరుమ పట్టణంలో ఉన్న అబీమెలెకు దగ్గరకు జెబులు వార్తాహరులను పంపించాడు. ఆ సందేశం యిది: “ఎబెదు కుమారుడు గాలు, మరియు గాలు సోదరులు షెకెము పట్టణం వచ్చారు. వారు మీకు చిక్కులు కలిగిస్తున్నారు. మొత్తం పట్టణాన్ని గాలు మీకు విరోధంగా తిప్పుతున్నాడు. కనుక మీరు, మీ మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట పొలాల్లో దాగుకోవాలి. తరువాత సూర్యోదయం కాగానే పట్టణం మీద దాడి చేయండి. మీతో యుద్ధం చేయటానికి గాలు, అతని మనుష్యులు బయటకు వస్తారు. ఆ మనుష్యులు పోరాడేందుకు బయటకు రాగానే వారికి మీరు చేయగలిగింది చేయండి.” కనుక ఆ రాత్రివేళ అబీమెలెకు, అతని సైనికులు లేచి పట్టణానికి వెళ్లారు, ఆ సైనికులు నాలుగు గుంపులుగా విడిపోయారు. వారు షెకెము పట్టణానికి దగ్గరలో దాగుకొన్నారు. ఎబెదు కుమారుడు గాలు బయటకు వెళ్లి షెకెము పట్టణ ద్వార ప్రవేశం దగ్గర నిలబడ్డాడు. గాలు అక్కడ నిలబడి ఉండగా అబీమెలెకు, అతని సైనికులు వారి రహస్య స్థలాల నుండి బయటకు వచ్చారు. గాలు ఆ సైనికులను చూశాడు. గాలు, “అదిగో చూడు. ఆ కొండల మీద నుండి మనుష్యులు దిగి వస్తున్నారు” అని అన్నాడు. కాని జెబలు, “నీకు కనబడుతోంది కొండల నీడలు మాత్రమే. ఆ నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే కనబడతాయి” అన్నాడు. కాని, “అదిగో చూడు అక్కడ. ఆ చోట నుండి కొందరు మనుష్యుల దండు దిగివస్తోంది. ఆ శకునగాండ్ర వృక్షం పక్కగా ఎవరిదో తల నాకు కనబడుతోంది” అని గాలు మరల చెప్పాడు. నీవు ఇప్పుడు ఎందుకు అతిశయించుట లేదు? “‘అబీమెలెకు ఎవడు? మేము ఎందుకు అతనికి విధేయులము కావాలి?’ అని నీవు అడిగావు. ఈ మనుష్యులను గూర్చి నీవు హేళన చేశావు. ఇప్పుడు వెళ్లి వారితో యుద్ధం చేయి” అని జెబులు గాలుతో చెప్పాడు. కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు. అబీమెలెకు, అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను వెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం వైపు వెనుకకు పరుగెత్తారు. ఆ ద్వారం చేరక ముందే గాలు మనుష్యులు చాలామంది చంపివేయబడ్డారు. అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం నుండి జెబులు బలవంతంగా వెళ్లగొట్టాడు. మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు. కనుక అబీమెలెకు తన మనుష్యులను మూడు గుంపులుగా విభజించాడు. షెకెము ప్రజలపై ఆశ్చర్య రీతిగా దాడి చేయాలని అతడు అనుకొన్నాడు. కనుక అతడు తన మనుష్యులను పొలాల్లో దాచి ఉంచాడు. ప్రజలు పట్టణంలో నుండి బయటకు రావటం అతడు చూడగానే అతడు దూకి వారిపై దాడిచేశాడు. అబీమెలెకు, అతని గుంపువారు షెకెము ద్వారం దగ్గర ఒక చోటికి పరుగెత్తారు. మిగిలిన రెండు గుంపుల వారు పొలాల్లో ఉన్న ప్రజల దగ్గరకు పరుగెత్తి వారిని చంపివేశారు. ఆ రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణం మీద యుద్ధం చేశారు. అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణ ప్రజలను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు ఆ పట్టణాన్ని కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు. షెకెము గోపురం దగ్గర కొంతమంది ప్రజలు నివసించేవారు. షెకెమునకు సంభవించిన దాన్ని గూర్చి అక్కడి ప్రజలు విన్నప్పుడు వారు ఏల్‌బెరీతు దేవతా మందిరంలో ఎంతో క్షేమంగా ఉండే గదిలో సమావేశమయ్యారు. షెకెము గోపురపు నాయకులందరూ సమావేశమయ్యారని అబీమెలెకు విన్నాడు. కనుక అబీమెలెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను చేసిన పని చేయండి” అని చెప్పాడు. కనుక వారందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. ఏల్‌బెరీతు దేవతా మందిరపు భద్రతాగదికి అడ్డంగా కుప్ప వేసారు. అప్పుడు వారు ఆ కొమ్మలకు నిప్పు అంటించి ఆ గదిలో ఉన్న మనుష్యులను కాల్చివేసారు. కనుక షెకెము గోపురం దగ్గర నివసించే స్త్రీ పురుషులు వెయ్యిమంది చనిపోయారు. అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు పట్టణం వెళ్లారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. కాని ఆ పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. ప్రజలు ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు మీదికి ఎక్కారు. ఆ గోపురం మీద దాడి చేయుటకు అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు. కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది. వెంటనే అబీమెలెకు తన ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయి. ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది’ అని ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను చంపివేయాలి” అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు చనిపోయాడు. అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు విషయాలు అన్నింటికోసం దేవుడు అతణ్ణి శిక్షించాడు. అబీమెలెకు తన డెభ్భై మంది సోదరులను చంపి తన స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు. షెకెము పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా గిద్యోను).