అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమారుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసిస్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన మామలతోను, తన తల్లి వంశస్థులందరితోను ఇలా చెప్పాడు: “షెకెము పట్టణపు నాయకులను ఈ ప్రశ్న అడగండి: ‘యెరుబ్బయలు యొక్క డెబ్బై మంది కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక ఒకే మనిషిచేత పాలింపబడుట మంచిదా? నేను మీ బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.’” అబీమెలెకు మామలు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయకులు చెప్పారు. కనుక షెకెము నాయకులు డెభ్భై వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి బయలు బెరీతు దేవతా మందిరానికి చెందినది. అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మనుష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబడించారు. అబీమెలెకు ఒఫ్రాలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. అబీమెలెకు తన తండ్రియైన యెరుబ్బయలు (గిద్యోను) కుమారులు డెభ్భై మందిని చంపివేశాడు. అతడు వారందరినీ ఒకే సమయంలో చంపివేశాడు. అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలెకునకు కనబడకుండా దాగుకొని తప్పించుకొన్నాడు. ఆ చిన్న కుమారుని పేరు యోతాము. అప్పుడు షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమావేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము (మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమెలెకును వారి రాజుగా చేసుకున్నారు. షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు: “షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును. “ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి. “కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’ “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి. “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు. “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి. “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నది. “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి. “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది. “అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరుబ్బయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామర్శించాల్సినట్టు, పరామర్శించియుంటే మంచిదే. కానీ నా తండ్రి మీ కోసం ఏమి చేశాడో ఆలోచించండి. నా తండ్రి మీ కోసం పోరాడాడు. మిద్యాను ప్రజలనుండి అతడు మిమ్మల్ని రక్షించినప్పుడు తన ప్రాణాన్ని అపాయానికి గురిచేసుకున్నాడు. కానీ ఇప్పుడు మీరు నా తండ్రి వంశానికి విరోధంగా తిరిగారు. నా తండ్రి కుమారులు డెభ్భై మందిని ఒకేసారి మీరు చంపివేసారు. అబీమెలెకును షెకెము పట్టణము మీద రాజుగా మీరు చేశారు. అతడు మీకు బంధువు గనుక మీరు అతనిని రాజుగా చేశారు. కానీ అతడు కేవలం నా తండ్రి యొక్క దాసీ కుమారుడు మాత్రమే! కనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతోషంగా ఉండవచ్చు. కాని మీరు సరిగ్గా ప్రవర్తించి ఉండకపోతే, షెకెము నాయకులైన మిమ్మల్ని మిల్లో ఇంటివారిని అబీమెలెకు నాశనం చేయును గాక. మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును గాక.” యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారిపోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించుకొని పోయాడు. యోతాము అతని సోదరుడైన అబీమెలెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే ఉండిపోయాడు.
చదువండి న్యాయాధిపతులు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధిపతులు 9:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు