న్యాయాధిపతులు 6:6-16

న్యాయాధిపతులు 6:6-16 TERV

మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. మిద్యానీయులు ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’ ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.” ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.” యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు. అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు. యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.