ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.” యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు. అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు. యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.” యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు. కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు. దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు. యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు. గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు. కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు. కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.
Read న్యాయాధిపతులు 6
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధిపతులు 6:11-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు