యెహోవా చెబుతున్నాడు: “సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను. ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను. రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం. ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది, అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత దారులకు ఇచ్చివేస్తారు. ‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’ అని ఖైదీలతో మీరు చెబుతారు. ‘చీకటిలోనుండి బయటకు వచ్చేయండి’ అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబుతారు. ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు. ఖాళీ కొండలమీద కూడా వారికి భోజనం ఉంటుంది. ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో ఉండరు. సూర్యుని వేడి గాల్పులు వారికి హానిచేయవు. ఎందుకంటే, వారిని ఆదరించే వాడు (దేవుడు) వారిని నడిపిస్తాడు గనుక. ప్రజలను నీటి ఊటలు దగ్గరకు ఆయన నడిపిస్తాడు. నా ప్రజలకు నేను బాట వేస్తాను. పర్వతాలు సమతలం చేయబడతాయి. పల్లపు తోవలు ఎత్తు చేయబడతాయి. “చూడండి! చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఉత్తరం నుండి, పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు. ఈజిప్టులోని అస్వాను నుండి ప్రజలు వస్తున్నారు.” భూమి, ఆకాశములారా సంతోషించండి. పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి. ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక. తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు. కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు. నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని. అయితే నేనంటాను, “ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు. తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా? లేదు. ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు. మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను. చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను. ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను. నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు. ప్రజలు నిన్ను ఓడించారు, కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా విడుస్తారు.” పైకి చూడు! నీ చుట్టూ చూడు! నీ పిల్లలు అందరూ సమావేశమై నీ దగ్గరకు వస్తున్నారు. యెహోవా చెబుతున్నాడు: “నేను సజీవంగా ఉన్నాను, నేను మీకు ఈ వాగ్దానం చేస్తున్నాను: నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు. పెండ్లి కుమార్తె ధరించే ఒడ్డాణంలా నీ పిల్లలు ఉంటారు. “ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి ఉన్నావు. నీ భూమి నిష్ప్రయోజనం. అయితే కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎందరెందరో మనుష్యులు ఉంటారు. నిన్ను నాశనం చేసిన ఆ మనుష్యులు చాలా చాలా దూరంగా ఉంటారు. నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచారంగా ఉన్నావు. అయితే ఆ పిల్లలు, ‘ఈ స్థలం మేము నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది. మేము నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు’ అని నీతో చెబుతారు. అప్పుడు నీలో నీవు అనుకొంటావు, ‘ఈ పిల్లలందర్నీ నాకు ఎవరు ఇచ్చారు? ఇది చాలా బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను. నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను. అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు? చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను. ఈ పిల్లలంతా ఎక్కడనుండి వచ్చారు?’” నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు, “చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను. ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని ఎగురవేస్తాను. అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు. ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు, మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు కొంటారు. నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు. రాజకుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటారు. రాజులు, వారి కుమార్తెలు నీ ఎదుట సాష్టాంగపడ్తారు. నీ పాదాల క్రింద ధూళిని వారు ముద్దు పెట్టుకొంటారు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు. నా యందు విశ్వాసం ఉంచే వాడెవడూ నిరాశచెందడని నీవు తెలుసుకొంటావు.” బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో గనుక ఐశ్వర్యం గెలుచుకొంటే ఆ ఐశ్వర్యాన్ని అతని దగ్గర్నుండి నీవు తీసుకోలేవు. బలమైన సైనికుడు ఒక ఖైదీకి కాపలా ఉంటే ఆ ఖైదీ తప్పించుకోలేడు. అయితే యెహోవా చెబుతున్నాడు, “బలమైన సైనికుని దగ్గర్నుండి ఖైదీలు తప్పించబడతారు. ఆ ఖైదీలు తప్పించుకొంటారు. ఇది ఎలా జరుగుతుంది? నీ యుద్ధాలు నేను పోరాడుతాను నీ పిల్లల్ని నేను రక్షిస్తాను.
చదువండి యెషయా 49
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 49:8-25
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు