యెషయా 14:1-15

యెషయా 14:1-15 TERV

భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు. ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు. యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు. ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు. ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది. చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు. వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు. బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు. ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు. అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది. ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు పెడుతున్నారు. నీవు ఒక దుష్ట రాజువు కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది. చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు. కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు. అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.” నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది. భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది. పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు. ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు. “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు. నీ గర్వం పాతాళానికి పంపబడింది. నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి. కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు. పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి. ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా! నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.? జనాంగాన్ని పతనం చేసే నీవు భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు. నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పుకొన్నావు: “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను. పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను. నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను. పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను. మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను. నేను, మహోన్నతుడైన దేవునిలా ఉంటాను.” కానీ అది జరుగలేదు. నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతిలోనికి పాతాళానికి నీవు క్రిందికి తీసుకొని రాబడ్డావు.

యెషయా 14:1-15 కోసం వీడియో