యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, అతని సేవకులు చాలా సంతోషించారు. కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు. నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.” తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు. వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.” కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేశారు. ఫరో వాగ్దానం చేసినట్లే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు. ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు. యోసేపు తన తండ్రికి కానుకలు కూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి, పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడిదల మీద అతడు పంపించాడు. అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు. కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు. ఆ సోదరులు “నాయనా, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు. అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత తనని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు. “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
చదువండి ఆదికాండము 45
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 45:16-28
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు