ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు. ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి. ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను. ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి. నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేశాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు, చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.” కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు. అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. “నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు. “నీవు మాకు కీడు చేశావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యేవాడు” అన్నాడు అబీమెలెకు. అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు. ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు. ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు. గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు. కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు. అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.
చదువండి ఆదికాండము 26
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 26:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు