ఆదికాండము 25:19-34

ఆదికాండము 25:19-34 TERV

ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు. రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.” తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది. మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు అని పేరు పెట్టబడింది. రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ. ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు. కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఎదోం అని పిలిచేవాళ్లు.) అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు. ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు. కానీ యాకోబు, “దాన్ని నాకు ఇస్తానని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు. అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేశాడు.

Read ఆదికాండము 25

ఆదికాండము 25:19-34 కోసం వీడియో