అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడక్రింద పెట్టు. ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వనని భూమ్యాకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు. నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.” ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారున్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు. అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారున్ని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు. పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం. కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు. అయితే ఆ అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరిపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.” కనుక ఆ సేవకుడు తన యజమాని తొడక్రింద తన చేయి పెట్టి వాగ్దానం చేశాడు. అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు. పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు. ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు. ఇదిగో, మంచి నీళ్ల బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు. ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు త్రాగాలి, నీ కడవ క్రింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘త్రాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.” అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది.
చదువండి ఆదికాండము 24
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 24:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు