అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు. ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి. ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్తువులు తెచ్చారు. ముక్కుకమ్ములు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు. నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది. సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊరు కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊరు). బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు. అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు. ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు. ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలీయాబు). అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుట్టా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.