నిర్గమకాండము 3:1-17

నిర్గమకాండము 3:1-17 TERV

మోషే మామ పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ. ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు. ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు. అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు. ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు. “చిత్తం ప్రభూ” అన్నాడు మోషే. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.” దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు. యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు. అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు. “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు. దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు. “‘నేను ఉన్నవాడను’ (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు. “వెళ్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని సమావేశపరిచి, ‘మీ పూర్వీకుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను. ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికొచ్చాను. ప్రస్తుతం కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, అనే రకరకాల ప్రజలకు చెందిన ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని వాళ్లతో చెప్పు.

నిర్గమకాండము 3:1-17 కోసం వీడియో