నిర్గమకాండము 23:1-13

నిర్గమకాండము 23:1-13 TERV

“ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు. “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నీవు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే, నీవు వారితో కలువ వద్దు. నీవు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నీవు చెయ్యాలి. “ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నీవు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.) “తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే. మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి. “ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయకూడదు. ఇతరులు ఎవరికైనా తీర్చినట్టే తీర్పు తీర్చాలి. “ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను. “ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది. “విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.) “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి. “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది. “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.

నిర్గమకాండము 23:1-13 కోసం వీడియో