“ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
“ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే. ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
“ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి. అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
“ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి. ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”
“ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.
“ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది. అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”