ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3:11-21

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3:11-21 TERV

దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది. ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన. దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.