ప్రసంగి 3:16-22

ప్రసంగి 3:16-22 TERV

ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కనుగొంటుంది చెడుగు. అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.” మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు. మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’ మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా? అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి. మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు.