ప్రసంగి 2:1-16

ప్రసంగి 2:1-16 TERV

నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను. (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు. అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను. అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను. తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను. నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను. నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు చాల గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి. నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను సంపాదించాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఎవరు కోరినదైనా కలిగియుంటిని. నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి. నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం ఈ ఆనందమే. అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది. ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు. ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొకడెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు. (రాజు చేసేపనులు కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను. చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను. అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తున్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు) నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.” జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు.