ద్వితీయోపదేశకాండము 4:35-40

ద్వితీయోపదేశకాండము 4:35-40 TERV

ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు. “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే. “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు. మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీ దేశంగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఈ దేశంలో మీరు దీర్ఘకాలం జీవిస్తారు.”