దానియేలు 3:14-22

దానియేలు 3:14-22 TERV

అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!” షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.” అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. కొలిమి మామూలుకంటె ఏడు రెట్లు వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వేడి కొలిమిలోకి తోసివేయుమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి తోసివేశారు. వాళ్లను మంటలోకి విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండటంవల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే, ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలి చచ్చారు.

Read దానియేలు 3