దానియేలు 2:24-30

దానియేలు 2:24-30 TERV

తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు. దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు. రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?” దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి. రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గుప్త విషయాల గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే, ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచనల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.