కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:8-15

కొలొస్సయులకు వ్రాసిన లేఖ 3:8-15 TERV

కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది. క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.