ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు. అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు. కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు. సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు. ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
చదువండి అపొస్తలుల 9
వినండి అపొస్తలుల 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల 9:20-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు